: నాడు పవన్ కల్యాణ్ మాటకు సరేనని, నేడు మాట తప్పిన ఏపీ ప్రభుత్వం.. మరి పవన్ ఏం చేస్తారో!
సుమారు 20 నెలల క్రితం అమరావతి ప్రాంతంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పర్యటించిన వేళ, ప్రజలకు ఇష్టం లేకుండా భూ సేకరణ, సమీకరణ చేయవద్దని, అలా చేస్తే ప్రజలతో కలిసి తాను ఉద్యమానికి సిద్ధమని చెప్పినప్పుడు, తాము ప్రజలకు ఇష్టం లేని పనిని చేయబోమని వివరణ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మాట తప్పింది. పవన్ కల్యాణ్ ఆనాడు కురగల్లు, నవులూరు, పెనుమాక తదితర గ్రామాల ప్రజలతో మాట్లాడి, ఈ భూములన్నీ ఇప్పటికే అభివృద్ధి చెందాయని గుర్తు చేస్తూ, వీటిని అమరావతి నుంచి మినహాయించాలని కోరగా, చంద్రబాబు ప్రభుత్వం నుంచి సానుకూల స్పందనే వచ్చింది.
ప్రజల ఆకాంక్షలను తాము అర్థం చేసుకోగలమని చంద్రబాబు, ఈ గ్రామాలకు నోటిఫికేషన్ ఇవ్వబోమని మంత్రి నారాయణ తదితరులు అప్పట్లో ప్రకటించారు. ఇక నేడు కురగల్లులో 185 ఎకరాలు, నవులూరులో 152 ఎకరాలకు 2013 నాటి భూ సేకరణ చట్టం కింద నోటిఫికేషన్ జారీ కాగా, తమ తరఫున పోరాడేందుకు పవన్ ముందుకు రావాలని ఈ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇచ్చిన మాట తప్పిన ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకు పోరాటానికి సిద్ధమని, పవన్ కల్యాణ్ ముందుంటే తమ గోడు మరింత వేగంగా ప్రపంచానికి తెలుస్తుందని ఇక్కడి ప్రజలు ఆశపడుతున్నారు. ఈ విషయంలో పవన్ స్పందన తెలియాల్సివుంది.