: కోహ్లీ 'గోల్డెన్ డకౌట్'గా వెనుదిరగడానికి కారణం ఇదే!
కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుతో నిన్న జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘోర పరాజయం పాలయింది. ఈ మ్యాచ్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతికే గోల్డెన్ డకౌట్ గా కోహ్లీ వెనుదిరిగాడు. నీలె వేసిన బౌలింగ్ లో పాండేకు క్యాచ్ ఇచ్చి కోహ్లీ డకౌట్ అయ్యాడు. గోల్డెన్ డకౌట్ కావడంతో కోహ్లీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. కోపం పట్టలేక బ్యాటుతో ప్యాడ్లపై కొట్టుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు చూస్తూ, ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. దీంతో, ఏం జరిగిందంటూ కోహ్లీని అంపైర్ అడిగాడు. ప్రేక్షకుల్లో ఒకరు తన ఏకాగ్రతకు భంగం కలిగించాడని అంపైర్ కు కోహ్లీ చెప్పాడు. సైట్ స్క్రీన్ వద్ద అతను తచ్చాడుతూ ఉండటాన్ని అంపైర్ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో, సదరు వ్యక్తిని సైట్ స్క్రీన్ దగ్గర నుంచి దూరంగా పంపించేశారు.
మ్యాచ్ ముగిసిన అనంతరం కోహ్లీ మాట్లాడుతూ, ఇక్కడ సైట్ స్క్రీన్ చాలా చిన్నగా ఉందని... అక్కడ ఓ వ్యక్తి నిలబడి బౌలర్ లా విన్యాసాలు చేశాడని... దీంతో తన కాన్సెంట్రేషన్ దెబ్బతిందని చెప్పాడు. అయితే, ఇదేమంత పెద్ద విషయం కాదని అన్నాడు.