: ఆ మోడళ్ల వ్యవహారంతో మాకు సంబంధం లేదు.. తేల్చి చెప్పిన కేంద్రం


తాజ్‌మహల్‌ను చూసేందుకు వచ్చిన విదేశీ మోడళ్లను అవమానించారంటూ వెల్లువెత్తుతున్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. ఈ వ్యవహారంలో పురావస్తుశాఖ, సీఐఎస్ఎఫ్ అధికారుల జోక్యం లేదని తేల్చి చెప్పింది. అసలేం జరిగిందంటే.. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన ‘సూపర్ మోడల్’ కాంటెస్ట్‌లో వివిధ దేశాల మోడళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 34 మంది మోడళ్లు తాజ్‌మహల్ సందర్శనకు వెళ్లారు. ఎండ వేడిమి కారణంగా వారిలో కొందరు తలపై కాషాయ కండువా కప్పుకున్నారు. వారిని అడ్డుకున్న భద్రతా సిబ్బంది కప్పుకున్న కాషాయ కండువాలను తొలగించాలని ఆదేశించినట్టు వార్తలు గుప్పుమన్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ హిందూ మత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో స్పందించిన కేంద్రం.. ఈ వ్యవహారంపై పోలీసులు విచారణ చేపట్టారని, కండువాల తొలగింపులో అధికారుల జోక్యం లేదని పేర్కొంది. టూరిస్ట్ గైడే మోడళ్లను కండువాలు తొలగించాలని చెప్పాడని సాంస్కృతిక శాఖామంత్రి మహేశ్ శర్మ వివరించారు. తాజ్‌మహల్‌లో కండువాలు, దుస్తుల రంగు, డిజైన్ తదితర వాటిపై ఎటువంటి నిషేధం లేదని, ఎవరి ఇష్టానుసారం వారు దుస్తులు ధరించవచ్చని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News