: ఏర్పేడు ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలి: వైఎస్ జగన్ డిమాండ్
ఏర్పేడు ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ అధినేత జగన్ డిమాండ్ చేశారు. ఏర్పేడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ఆయన పరామర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలీస్ స్టేషన్ వద్ద జరిగింది ప్రమాదం కాదని, ప్లాన్ ప్రకారం జరిగిందని గ్రామస్థులు చెబుతున్నారని అన్నారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, చిత్తూరు జిల్లాలో 100 చోట్ల ఇసుక అక్రమ రవాణా జరుగుతోందని ఆరోపించారు.
ధనుంజయ నాయుడు కుటుంబం ఆస్తులు జప్తు చేసి, మృతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. ధనుంజయ నాయుడిపై ఫిర్యాదు చేసినా ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించిన ఆయన, ఏర్పేడు ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇసుక, మట్టి పేరుతో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు దోపిడీకి పాల్పడుతున్నారని జగన్ ఆరోపించారు.