: ఆ రోజు వైజాగ్ కు 50 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్లో బంధించారు: సంపూర్ణేష్ బాబు
తెలంగాణకు చెందినవాడైనా ఆంధ్రప్రదేశ్ సినీ అభిమానుల మన్నన పొందాడు నటుడు సంపూర్ణేష్ బాబు. వైజాగ్ ను హుదూద్ తుపాను సర్వనాశనం చేసినప్పుడు కూడా తన వంతుగా ఆర్థిక సాయం చేశాడు సంపూ. పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే సంపూ ఈ పని చేశాడని కొందరు అప్పట్లో అనుకున్నారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో సంపూ స్పందించాడు. తాను పబ్లిసిటీ కోసం ఇది చేయలేదని చెప్పాడు. తుపాను తర్వాత వైజాగ్ పరిస్థితిని చూసి చలించిపోయానని అన్నాడు. అందుకే ఏమీ ఆలోచించకుండా లక్ష రూపాయలు ఇస్తానని ప్రకటించానని అన్నాడు. వాస్తవానికి తన దగ్గర అంత డబ్బు అప్పుడు లేదని... అందుకే రెండు వారాల సమయం తీసుకుని, అప్పు చేసి ఆ డబ్బును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించానని చెప్పాడు.
ఏపీకి ప్రత్యేక హోదా రావాలని తాను కోరుకున్నానని... జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగాలతో ఉత్తేజితుడినని అయ్యానని... అందుకే వైజగ్ లో జరిగే నిరసన దీక్షకు వస్తానని చెప్పానని... మాటకు కట్టుబడి అక్కడకు వెళ్లానని సంపూ తెలిపాడు. వైజాగ్ ఎయిర్ పోర్టు వద్దే తనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని... అక్కడకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ పోలీస్ స్టేషన్ లో తనను బంధించారని చెప్పాడు. సాయంత్రం 5 గంటలకు రిటర్న్ విమానం టికెట్ బుక్ చేసుకున్నానని... దీంతో, తనను ఎప్పుడు విడిచి పెడతారంటూ పోలీసులను అడిగితే... మాకు తెలియదండీ, కమిషనర్ గారు మీ మీద చాలా సీరియస్ గా ఉన్నారని చెప్పారని తెలిపాడు. ఆ తర్వాత 7 గంటల సమయంలో తనను విడిచి పెట్టారని, దీంతో, రాత్రి 10 గంటల ఫ్లైట్ కు హైదరాబాద్ కు వచ్చానని చెప్పారు. ఇవన్నీ తాను ఎంతో నిజాయతీగా చేశానని... పబ్లిసిటీ కోసం కాదని అన్నాడు.