: దినకరన్‌ను తప్పుకోమనడానికి మీరెవరు?.. మంత్రి నటరాజన్‌కు చేదు అనుభవం
తిరుచ్చి రాక్‌ఫోర్ట్ అందాలను వీక్షించేందుకు వెళ్లిన తమిళనాడు మంత్రి వెల్లమండి నటరాజన్‌కు చేదు అనుభవం ఎదురైంది. టీటీవీ దినకరన్ వర్గానికి చెందిన కొందరు మంత్రి కారును అడ్డుకుని ఆయనతో వాగ్వాదానికి దిగారు. దినకరన్‌ను పార్టీ నుంచి వైదొలగమని చెప్పడానికి మీరెవరంటూ ప్రశ్నించారు. ఇది మంత్రి, దినకరన్ వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. రాక్‌ఫోర్ట్ నుంచి తిరుచ్చి అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేసిన టెలిస్కోన్‌ను ప్రారంభించేందుకు నటరాజన్‌తోపాటు మరో మంత్రి వళర్మతి తదితరులతో కలిసి తిరుచ్చి చేరుకున్నారు.
ప్రారంభోత్సవం అనంతరం తిరిగి బయలుదేరిన వారిని దినకరన్ వర్గానికి చెందిన రాజరాజ చోళన్ ఆధ్వర్యంలో కొందరు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. పార్టీ పదవి నుంచి దినకరన్‌ను తప్పించడానికి మీరెవరంటూ ఆయన వర్గం ప్రశ్నించగా ఆ అధికారం తమకుందని మంత్రి పేర్కొన్నారు. దీంతో ఇరు వర్గాలు పరస్పరం నినాదాలు చేయడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అంతేకాదు, ఒకరిపై ఒకరు దాడులకు దిగారు. అయితే మంత్రి అనుచరులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో చోళన్ వర్గీయులు అక్కడి నుంచి జారుకున్నారు. మంత్రి ఫిర్యాదుతో శనివారం చోళన్ వర్గానికి చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.