: విజయమే లక్ష్యంగా లోక్‌సభ నియోజక వర్గాలకు ఇన్‌చార్జ్ మంత్రుల నియామకం.. లోకేశ్ కు విజయవాడ బాధ్యత!
వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రాష్ట్రంలోని 25 లోక్‌సభ నియోజక వర్గాలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టీడీపీ తరపున ఇన్‌చార్జ్ మంత్రులను నియమించారు. బీజేపీకి చెందిన మంత్రులను మినహాయించి మంత్రివర్గంలోని 23 మంది మంత్రులు, ఇద్దరు కేంద్రమంత్రులకు చంద్రబాబు ఈ బాధ్యతలు అప్పగించారు. కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును అనకాపల్లి, కొత్త మంత్రి నారా లోకేశ్ విజయవాడ, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కృష్ణా జిల్లా, భూమా అఖిలప్రియ తిరుపతి ఇన్‌చార్జ్ మంత్రులుగా నియమితులయ్యారు.
తిరుపతి ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు ఇక నుంచి చిత్తూరు ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తారు. అలాగే కొత్తగా మంత్రి బాధ్యతలు చేపట్టిన పితాని సత్యనారాయణ శ్రీకాకుళం, కళావెంకట్రావు కాకినాడ-తూర్పుగోదావరి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కడప, అమర్‌నాథ్‌రెడ్డి నెల్లూరు జిల్లాలకు ఇన్‌చార్జ్ మంత్రులుగా వ్యవహరించనున్నారు. సీనియర్ నేత కేఈ కృష్ణమూర్తికి ఈసారి కూడా రాజమండ్రి బాధ్యతనే అప్పగించారు. కడప జిల్లాకు చెందిన మంత్రి ఆదినారాయణరెడ్డి అదే జిల్లాలోని రాజంపేట లోక్‌సభ స్థానానికి ఇన్‌చార్జిగా నియమితులయ్యారు.