: ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఆటోలోనే ప్రసవించిన మహిళ!
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఓ గర్భిణీ ఆటోలోనే ప్రసవించింది. ఈ రోజు ప్రభుత్వ ఆస్పత్రికి ఆటోలో వెళ్లిన రాములమ్మ(25) అనే నిండు గర్భిణి తనకు కాన్పు వచ్చేలా ఉందని ఆస్పత్రి సిబ్బందికి చెప్పింది. అయితే, ప్రసవానికి ఇంకా ఇరవై రోజుల సమయం ఉంది అంటూ ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. నొప్పితోనే తిరిగి ఆటో ఎక్కి ఇంటికి బయలుదేరిన రాములమ్మ ఒక్కసారిగా అందులోనే నొప్పులతో పడిపోయి, బిడ్డను ప్రసవించింది. ఆస్పత్రి ఆవరణలోనే ఆ ఆటో ఉన్నా ఆ ఆసుపత్రి సిబ్బంది ఆమె బాధను పట్టించుకోలేదు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, తాపీగా వచ్చిన ఆసుపత్రి సిబ్బంది తల్లితోపాటు శిశువును తీసుకెళ్లారు. తల్లీబిడ్డలు క్షేమంగానే ఉన్నారని చెప్పారు.