: 'నన్ను పడుకోనివ్వండి' అంటూ లేఖ రాసి.. ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య
'నన్ను పడుకోనివ్వండి' అంటూ ఒక లేఖ రాసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చోటు చేసుకుంది. కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న ఆ యువకుడు మరికొన్ని నెలల్లో పట్టా అందుకోవాల్సి ఉండగా ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఆ విద్యార్థి కేరళకు చెందిన ఎన్ నిధిన్ (22) గా గుర్తించారు. ఆ విద్యార్థి ప్రతిరోజూ అర్ధరాత్రి 2 గంటలకు అలారం పెట్టుకుని లేచి చదువుకునేవాడని, అయితే శుక్రవారం అర్ధరాత్రి అలారం మోగుతున్నప్పటికీ ఆ విద్యార్థి దాన్ని ఆఫ్ చేయకుండా ఉండడంతో ఇతర విద్యార్థులు అతడి గదికి వెళ్లి తలుపు కొట్టారని పోలీసులు తెలిపారు.
నిధిన్ ఎంతకీ తలుపు తీయకపోవడంతో వారంతా కలిసి హాస్టల్ అధికారులకు చెప్పారని, కిటికీ అద్దాలు పగలగొట్టి చూస్తే నిధిన్ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని కనిపించాడని చెప్పారు. ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని, తలుపులు పగలగొట్టి ఆ విద్యార్థి మృతదేహాన్ని కిందకు దించారు. ఆ విద్యార్థి రాసి పెట్టిన సూసైడ్ లేఖను స్వాధీనం చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఏడాది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇది మూడోసారి. నెల వ్యవధిలో ఇది రెండో ఆత్మహత్య.