: నారా లోకేశ్‌కు ఎలా మాట్లాడాలో శిక్షణ ఇస్తే మంచిది : అంబటి ఎద్దేవా
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ఫిప్త్ ఎస్టేట్‌గా మారిందని అటువంటి దానిపై ఆంక్షలు పెట్టడం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో అన్నీ నిజాలే పోస్ట్ చేస్తారని తాను అనడం లేదని, కానీ వాటిల్లో వాస్తవాలకు దగ్గరగా పోస్టులు ఉంటాయని ప్రజలు భావిస్తున్నారని ఆయన అన్నారు. కాగా, మంత్రి పదవికి టీడీపీ యువనేత నారా లోకేశ్ అనర్హుడని అంబటి రాంబాబు అన్నారు. ఓ పరిజ్ఞానం లేని వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన విమర్శలు చేశారు.
విమర్శలు చేసినంత మాత్రానే పొలిటికల్ పంచ్ ఆడ్మిన్ రవికిరణ్ ను అరెస్ట్ చేశారా? అని ఆయన నిలదీశారు. అసలు రవికిరణ్ ను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించిన అంబటి.. ఆయనను కోర్టులో ప్రవేశపెట్టకుండా మళ్లీ ఎందుకు వదిలేశారని అడిగారు. ఇటువంటి అరెస్ట్‌లు చేసేకంటే నారా లోకేశ్‌కు ఎలా మాట్లాడాలో శిక్షణ ఇస్తే మంచిది కదా? అని ఆయన అన్నారు. ఓ పరిణితి లేని వ్యక్తిని ఇలా మూడు శాఖలకు మంత్రిని చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన విమర్శలు గుప్పించారు.