: మహాభారతం మహాసముద్రం లాంటిది...ఎవరైనా సినిమా తీయొచ్చు: రాజమౌళి
మహాభారతం సినిమా తన డ్రీమ్ సినిమా అని తాను గతంలో చెప్పానని, ఇప్పటికీ తన డ్రీమ్ ప్రాజెక్టు అదేనని బాహుబలి దర్శకుడు రాజమౌళి అన్నారు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పానని, అయితే బాహుబలి 2 తరువాత మహాభారతం సినిమా పట్టాలెక్కేస్తుందని, అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ నటులని... ఇలా ఎన్నోవార్తలు తనకు సంబంధం లేకుండా రాసిపడేశారని ఆయన చెప్పారు. మహాభారతం తీయడానికి సరిపడే అనుభవం మరో పదేళ్ల తరువాత తనకు వస్తుందని ఆయన చెప్పారు. అప్పుడు నేను తీయగలననిపిస్తే తీస్తానని రాజమౌళి అన్నారు.
ఈమధ్యే ఎవరో యూఏఈ వ్యాపారి మహాభారతం తీస్తారని వార్తల్లో వచ్చిందని ఆయన అన్నారు. మహాభారతం మహాసముద్రంలాంటిదని... అందులో చెంబుడు ఆయన తీసుకుంటున్నారని, అలాగే మరో చెంబుడు నేను తీసుకుంటానని అన్నారు. ఇలా ఎవరికి కావాల్సినంత వారికి మహాభారతంలో ఉంటుందని ఆయన అన్నారు. అయితే ఎవరి ఊహలు, ఆలోచనలకు తగ్గట్టు వారు మహాభారతాన్ని తీస్తారని ఆయన తెలిపారు. ఎవరైనా దానిని తీయవచ్చని, దానికి, తనకు ఎలాంటి సంబంధం లేదని, తాను కూడా తీస్తానని...అది తన చిరకాల వాంఛ అని ఆయన చెప్పారు.