: మతాలు వేరవడంతో.. పెద్దలు ఒప్పుకోరని ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం!


వారిద్దరి మతాలు ఒకటి కాక‌పోయినా ప్రేమ అనే బంధం వారిని క‌లిపింది. అయితే, ప్రేమించుకోవడానికి క‌న‌బ‌ర్చిన ధైర్యాన్ని త‌మ పెద్ద‌ల‌కు త‌మ ప్రేమ విష‌యాన్ని చెప్ప‌డంలో క‌న‌బ‌ర్చలేక‌పోయారు. త‌మ మ‌తాలు వేరుకావ‌డంతో పెద్ద‌లు త‌మ‌ని శిక్ష‌స్తార‌నో, బాధ‌ప‌డుతార‌నో భావించారు. స్నేహితుల‌తో త‌మ బాధ చెప్పుకున్నారు. అయితే, ఫ్రెండ్స్ కూడా త‌మకు తోచింది చెప్పారు. వారిద్దరి మతాలు వేరుకావడంతో త‌మ పెళ్లికి రెండు కుటుంబాల సభ్యులు ఒప్పుకోరని ఫ్రెండ్ చెప్పిన మాట‌లు విని కృంగిపోయారు. పెద్ద‌ల‌కు చెప్పుకోలేక‌, ఒక‌రిని ఒక‌రు విడిచి ఉండ‌లేక తీవ్ర మ‌న‌స్తాపానికి గుర‌య్యారు. చావుతోన‌యినా ఒక‌ట‌వుదామ‌ని నిర్ణ‌యించుకొని ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతారంలో ఈ రోజు ఒల్లాల రవి(26),  ఎండీ సమ్రీన్‌(20) అనే జంట ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డారు. మొద‌ట‌ సమ్రీన్‌ తన ఇంట్లో తెల్ల‌వారుజామున పురుగుల మందు తాగింది. అదే సమయంలో రవి తన వ్యవసాయ బావి వద్ద పురుగు మందు తాగాడు. అయితే, అదృష్టం బాగుండి వారి వారి కుటుంబసభ్యులు వారిని  ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News