: కాంగ్రెస్ కంచుకోట బద్దలు.. లాతూర్ లో బీజేపీ పాగా!
కాంగ్రెస్ పార్టీ కంచుకోటను బీజేపీ బద్దలు కొట్టింది. మహారాష్ట్రలోని లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయ కేతనం ఎగురవేసింది. స్వాతంత్ర్యం వచ్చిన నాట నుంచి లాతూర్ ను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటూ వచ్చింది. అయితే, ఈసారి ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయానికి బీజేపీ చెక్ పెట్టింది. గత బుధవారం జరిగిన లాతూర్ మున్సిపల్ ఎన్నికలు ఫలితాలు ఈ రోజు వెలువడ్డాయి.
లాతూర్ కార్పొరేషన్ లో 70 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, అందులో, బీజేపీకి 36 స్థానాలు, కాంగ్రెస్ 33 స్థానాల్లో విజయం సాధించింది. లాతూర్ లో బీజేపీ విజయానికి సీఎం ఫడ్నవీస్ ఇచ్చిన హామీయే అని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. కరవుతో కొట్టుమిట్టాడే లాతూర్ లో తాము అధికారంలోకి వస్తే ఆ పరిస్థితులు ఉండవని, అభివృద్ధి చేస్తామని ఫడ్నవీస్ హామీ ఇవ్వడం జరిగింది. కాగా, ఐదేళ్ల క్రితం జరిగిన లాతూర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నాడు కాంగ్రెస్ పార్టీ 50 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు.