: మ్యాచ్ ఫినిష్ చేయకుండా అవుట్ అవ్వడం నేరమే...ఇకపై అలాంటి నేరం చేయకుండా జాగ్రత్తపడతా: యూసుఫ్ పఠాన్
గుజరాత్ తో నేటి సాయంత్రం 8 గంటలకు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ లో విజయంపై కోల్ కతా కీలక బ్యాట్స్ మన్ యూసుఫ్ పఠాన్ ధీమా వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడుతూ, బ్యాటింగ్ లో రాణిస్తున్నప్పుడు మ్యాచ్ ను ఫినిష్ చేయకుండా అవుట్ కావడం తన దృష్టిలో నేరమని చెప్పాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన గత మ్యాచ్ లో 39 బంతుల్లో 59 పరుగులు చేసి రాణించిన యూసుఫ్ పఠాన్ 169 పరుగుల లక్ష్యసాధనలో 100 పరుగుల భాగస్వామ్యం తరువాత చివర్లో అవుటయ్యాడు.
మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ చివర్లో అవుట్ కావడం బాధించిందని అన్నాడు. ఒక బ్యాట్స్ మన్ అవుటైతే అతని స్థానంలో వచ్చే కొత్త బ్యాట్స్ మన్ కుదురుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి బాగా ఆడుతున్న బ్యాట్స్ మనే మ్యాచ్ ను ఫినిష్ చేయాలని సూచించాడు. అలా చేయకపోవడం తన దృష్టిలో నేరమని, అలాంటి నేరం భవిష్యత్తులో పునరావృతం కాకుండా జాగ్రత్తపడతానని యూసుఫ్ పఠాన్ తెలిపాడు.