: దివ్యాంగుడి కోసం కాన్వాయ్ ఆపించి, కారు దిగిన చంద్రబాబు
తనను కలిసేందుకు వచ్చి, అవకాశం దక్కించుకోలేని ఓ దివ్యాంగుడి కోసం ఏపీ సీఎం చంద్రబాబు, కాన్వాయ్ ని ఆపించి మరీ అతన్ని కలిశారు. ఈ ఘటన ఉండవల్లి సీఎం నివాసం వద్ద జరిగింది. పల్నాడు ప్రాంతంలోని దాచేపల్లి నుంచి సీఎంను కలిసేందుకు వచ్చిన వెలుగు శివప్రసాద్ అనే దివ్యాంగుడు, తనకు అవకాశం లభించక పోవడంతో సీఎం ఇంటి బయటే ఉండిపోయాడు. ఇక, అనంతపురంలో పాల్గొనే సభకోసం హుటాహుటిన బయలుదేరిన చంద్రబాబు, ఇంటి బయట ఉన్న శివప్రసాద్ ను చూసి కాన్వాయ్ అపించి, కిందకు దిగారు. అతన్ని కలిసి సమస్యేంటని అడిగారు. డిగ్రీ చదివిన తనకు ఉద్యోగం లేదని, ఇల్లు కూడా లేదని చెప్పడంతో, సహాయం చేసేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. దీంతో తన అభిమాన నేత స్వయంగా తన కోసం దిగివచ్చాడన్న ఆనందం ఆ దివ్యాంగుడి కళ్లలో స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన నిన్న చంద్రబాబు పుట్టిన రోజున జరిగింది.