: విమానాల హైజాక్ డ్రామా ఆడిన వంశీ 'కృష్ణ లీలలు' అన్నీ ఇన్నీ కాదు!


పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు గ్రామం నుంచి దశాబ్దాల క్రితమే ఉపాధి నిమిత్తం వచ్చి హైదరాబాద్ లో స్థిరపడిన కుటుంబంలోని మొటపర్తి వంశీకృష్ణ... అలియాస్‌ వంశీ చౌదరి. ట్రావెల్‌ ఏజెంట్‌ గా పని చేస్తూ, ప్రియురాలిని షికారుకు తీసుకెళ్లలేక, విమానాల హైజాక్‌ పేరుతో డ్రామా ఆడి, పోలీసులను ముప్పుతిప్పులు పెట్టి ఇప్పుడు కటకటాల వెనక్కు వెళ్లాడు. ఇతని 'కృష్ణ లీలలు' అన్నీ ఇన్నీ కాదని, కేసును విచారిస్తున్న పోలీసులు తెలియజేశారు. సోషల్ మీడియా మాధ్యమాలైన ఫేస్‌బుక్‌, వాట్స్ యాప్ ల ద్వారా అమ్మాయిలతో చాటింగ్‌ చేయడం, ఆసక్తి చూపిన వారిని ఎంచుకుని వారంతాల్లో బెంగళూరు, ఢిల్లీ, ఆగ్రా, ముంబై, గోవా తదితర ప్రాంతాలకు వెళ్లి, ఓ వారం గడిపిరావడం అతని జీవితంగా మారింది.

గత రెండేళ్లుగా వంశీ కృష్ణ చేస్తున్నదిదే. నాలుగేళ్ల క్రితమే, ఓ మోసం కేసులో జైలుకు వెళ్లినా బుద్ధి తెచ్చుకోలేదు. తనకు ట్రావెలింగ్ అంటే ఇష్టమని, కొత్త ప్రదేశాలకు వెళ్తుంటానని చెబుతూ, తన అనుభవాలను అమ్మాయిలకు చెబుతూ, వారిపై వల విసురుతాడు. తనతో బాగా మాట్లాడిన అమ్మాయిలను ఎంచుకుని, వారుండే ప్రాంతాలకే, అంటే, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రాంతాలకు వెళ్లి వారిని కలుస్తాడు. పబ్బులకు పిలిచి పార్టీలిస్తాడు. ఆపై డేటింగ్ అంటూ ప్రతిపాదించి, విమానాల్లో ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి వారితో గడిపి వస్తుంటాడు. ఈ అలవాట్లతోనే ఆస్తినంతా హారతి కర్పూరం చేసుకున్నాడు. ఇటీవలి కాలంలో డబ్బు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, తనకు పరిచయమైన ఓ చెన్నై యువతిని విమానం ఎక్కించలేక, ఇలా హైజాక్ డ్రామాకు తెరలేపి, అడ్డంగా బుక్కయ్యాడు.

  • Loading...

More Telugu News