: 'మోగ్లీ గర్ల్' అసలు పేరు లక్ష్మి... 2012లో తప్పిపోయిందంటూ వచ్చిన తల్లిదండ్రులు!
యూపీ అడవుల్లో కోతులతో పాటు పెరుగుతూ, అధికారుల కంటబడి, ఇప్పుడు వైద్యుల సంరక్షణలో మామూలు అమ్మాయిగా మారుతున్న 'మోగ్లీ గర్ల్' తమ బిడ్డేనని ఓ జంట పోలీసుల ముందుకు వచ్చింది. ఆమె అసలు పేరు లక్ష్మి అని, 2012లో తప్పిపోయిందని చెబుతూ, అప్పట్లో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును చూపించారు. తాము డీఎన్ఏ పరీక్షకు సిద్ధమేనని, పరీక్షలు నిర్వహించి లక్ష్మిని అప్పగించాలని వారు కోరారు. ఇక ఆ ఫిర్యాదును పరిశీలించిన తరువాత, రక్త పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఓ అభయారణ్యంలో పెట్రోలింగ్ కు వెళ్లిన పోలీసులకు కోతుల మధ్య ఉంటూ, వాటితో ఆడుకుంటూ 'మోగ్లీ గర్ల్' కనిపించగా, పోలీసులు అతి కష్టం మీద కోతులను తరిమి, ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే.