: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద కుట్రను ఛేదించి, పదిమంది ఉగ్రవాదులను అరెస్టు చేసిన భద్రతా దళాలు
దేశంలో భారీ విధ్వంసానికి కుట్రపన్నిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల కుట్రను భద్రతాదళాలు ఛేదించాయి. ఐఎస్ఐఎస్ మ్యాపులో ఇస్లామిక్ స్టేట్ పాలనను తీసుకొస్తామంటూ ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, భారత్, బంగ్లాదేశ్ ప్రాంతాలను ఖొరాసాన్ గా పేర్కొన్నాయి. ఈ దేశాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే ఉగ్రవాదులను ఐఎస్ ఖొరసాన్ గా పిలుస్తారు. ఈ గ్రూపుకు చెందిన పది మంది ఉగ్రవాదులను బద్రతా దళాలు జాయింట్ ఆపరేషన్ లో పట్టుకున్నాయి. మార్చి 7న లక్నో శివార్లలో ఒక ఉగ్రవాదిని భద్రతాధికారులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అతను దాక్కున్న ఇంట్లో పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన భద్రతా దళాలు దేశంలో భారీస్థాయి ఉగ్రదాడికి ఐఎస్ తీవ్రవాద సంస్థ కుట్ర పన్నిందని గుర్తించాయి.
దీంతో ఢిల్లీ స్పెషల్ సెల్, యూపీ, మహారాష్ట్ర ఉగ్రవాద అణచివేత దళాలు, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, బిహార్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సంయుక్త ఆపరేషన్ ను ముంబ్రా (మహారాష్ట్ర), జలంధర్ (పంజాబ్), నార్కటియాగంజ్ (బిహార్), బిజ్నోర్, ముజఫర్‌నగర్ (యూపీ) లలో ఐఎస్ ఖొరసాన్ మాడ్యూల్ కుట్రను ఛేదించడమే కాకుండా, ఈ గ్రూపుకు చెందిన ముఫ్తీ ఫైజాన్, తన్వీర్ (బిజ్నోర్), నిజాం శంషాద్ అహ్మద్ (ముంబ్రా-థానే), ముజామిల్ (జలంధర్)లను అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరితో పాటు మరో ఆరుగురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు వారు వెల్లడించారు.