: టైమ్ జాబితాలో నిలిచిన ప్రధాని మోదీ, పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శర్మ


గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో త‌న స‌త్తాచాటి భార‌తీయ జ‌న‌తా పార్టీని తిరుగులేని మెజారిటీతో గెలిపించిన భార‌త ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మేనియా ఇంకా కొన‌సాగుతోంది. టైమ్ పత్రిక ప్రతి ఏటా ప్రకటించే అత్యంత ప్రభావశీలురైన వంద మంది వ్యక్తుల్లో మోదీ నిలిచారు. మూడేళ్ల తర్వాత కూడా మోదీ మేనియా ఏమాత్రం తగ్గలేదని ఈ సంద‌ర్భంగా టైమ్ ప‌త్రిక పేర్కొంది. ప్రజలను ఆక‌ట్టుకుంటూ మోదీ అద్భుతమైన ప్రతిభ క‌న‌బ‌రుస్తున్నారని చెప్పింది. ఇటీవ‌ల జ‌రిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయాన్ని కూడా టైమ్ గుర్తు చేసింది.

ఇక భార‌త్‌నుంచి ఆ జాబితాలో ఎన్నికైన వారిలో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ కూడా ఉన్నారు. ఇండియాలో డిజిటల్ ఆర్థిక వ్యవస్థను ఆయ‌న‌ ముందుండి నడిపిస్తున్నారని టైమ్ కొనియాడింది. భార‌త్‌లో పెద్ద నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో పేటీఎం వ్య‌వ‌స్థాప‌కుడు ఆ అవకాశాన్ని సరిగ్గా అందిపుచ్చుకున్నారని తెలిపింది. గ‌త ఏడాది ప్రారంభం నాటికి పేటీఎంకు 12.2 కోట్ల మంది యూజర్లు ఉన్నార‌ని, సంవ‌త్స‌రం తిరిగే నాటికి వారి సంఖ్య 17.7 కోట్లకు చేరుకుందని చెప్పింది. మారుమూల‌ పల్లెటూరి నుంచి వచ్చి హిందీ మీడియంలో విద్యాభ్యాసం చేసిన విజ‌య్ శేఖ‌ర్ శ‌ర్మ‌ డిజిటల్ ఎకానమీ దిశ‌గా అద్భుత విజ‌యాన్ని అందుకున్నార‌ని చెప్పింది. ఇక టైమ్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, బ్రిటన్ ప్రధాని థెరెసా మే కూడా చోటు సంపాదించుకున్నారు.

  • Loading...

More Telugu News