: దయచేసి బాహుబలి-2 విడుదలను అడ్డుకోవద్దు: కన్నడలో మాట్లాడుతూ వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి
బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ గతంలో చేసిన పలు వ్యాఖ్యల ఫలితంగా కన్నడ ప్రజలు మండిపడుతూ ఈ నెల 28న విడుదల కానున్న బాహుబలి-2ను కర్ణాటకలో విడుదల కానివ్వబోమని తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో రూపొందించిన ఈ సినిమా కర్ణాటకలో విడుదల కాకపోతే ఆ ప్రభావం బాగానే పడనుండడంతో ఈ చిత్రం దర్శకుడు రాజమౌళి కన్నడ ప్రజలకు ఓ విజ్ఞప్తి చేశారు. తన ట్విట్టర్ ఖాతాలో రాజమౌళి ఓ వీడియో పోస్ట్ చేసి, కన్నడలో మాట్లాడి ఈ చిత్రం విడుదలకు సహకరించాలని కోరారు.
తనకు కన్నడ సరిగా రాదని, ఏవైనా తప్పులుంటే క్షమించాలని మొదటగా వ్యాఖ్యానించిన రాజమౌళి... ఎన్నో ఏళ్ల క్రితం సత్యరాజ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు సినిమాను అడ్డుకోవద్దని అన్నారు. సత్యరాజ్ చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని, ఆయన వ్యాఖ్యలతో బాహుబలి బృందానికి ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. బాహుబలి చిత్రం కోసం ఎంతో మంది నటీనటులు, టెక్నీషియన్స్ ఎంతో కష్టపడ్డారని, ఈ సినిమా విడుదలను అడ్డుకుంటే అందరూ నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. బాహుబలి-1ను ఆదరించినట్టుగానే కన్నడ ప్రేక్షకులు బాహుబలి-2ని కూడా ఆదరించాలని ఆయన వీడియో ద్వారా కోరారు.
An appeal to all the Kannada friends... pic.twitter.com/5rJWMixnZF
— rajamouli ss (@ssrajamouli) 20 April 2017