: మద్యం తాగి అమ్మాయిలతో చిందులేసిన ఉద్యోగులు ... సస్పెన్షన్ తో మత్తు దించిన యూపీ ప్రభుత్వం!
ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి పూటుగా మద్యం తాగడమే కాకుండా, అమ్మాయిలతో కలసి అసభ్య నృత్యాలు చేసి, వారికి ముద్దులు పెడుతూ అడ్డంగా చిక్కిన ఇద్దరిపై యూపీ సర్కారు వేటు వేసింది. ఈ ఘటన యూపీలోని గంగాపూర్ లో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, కౌశిక్, ముఖేష్ కుమార్ లు ప్రభుత్వ ఉద్యోగులు. వీరిద్దరూ గ్రామంలో జరిగిన ఓ వేడుకలో పాల్గొన్న వేళ, మందు కొట్టి, డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలతో కలసి చిందులేశారు. వారికి అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టారు. ఈ దృశ్యాలను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించిన కొందరు వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగులపై విమర్శలు వెల్లువెత్తగా, హాత్రాస్ జిల్లా కలెక్టర్ అవినాష్ సింగ్ వారి మత్తు దిగేలా ఆదేశాలు జారీ చేశారు. ఇద్దరినీ సస్పెండ్ చేస్తున్నామని, ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రకటించారు.