: కొంచమైనా బాధ్యతగా వ్యవహరించారా?: శ్రీశ్రీ రవిశంకర్ పై కోర్టు ఆగ్రహం
ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ పై పర్యావరణ ట్రైబ్యునల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. "మీరు కనీస బాధ్యతతో కూడా వ్యవహరించలేదు. మీరు ఏది అనుకుంటే అది చేసేయొచ్చనే స్వతంత్రం ఉందని భావిస్తున్నారా? ఎవరూ మిమ్మల్ని అడ్డుకోలేరని భావిస్తున్నారా?" అని గత సంవత్సరం ఢిల్లీలో యమునా నదీ తీరంలో జరిగిన భారీ సాంస్కృతిక ఉత్సవం తరువాత ఏర్పడిన కాలుష్యంపై విచారిస్తున్న సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
నిన్న రవిశంకర్ మాట్లాడుతూ, యమునా నదికి ముప్పు ఏర్పడిందంటే, దానికి ప్రభుత్వం, న్యాయస్థానాలే కారణమని, వారే ఆ కార్యక్రమానికి అనుమతించారని చేసిన వ్యాఖ్యలపై కోర్టు మండిపడింది. ఆనాటి కార్యక్రమం సందర్భంగా సుమారు 1000 ఎకరాల నదీ పరీవాహక ప్రాంతం పూర్తిగా నాశనమైందని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక ఇస్తూ, తిరిగి పరిస్థితి సాధారణ స్థితికి రావాలంటే, రూ. 42 కోట్లు ఖర్చు చేయాలని, దానికి 10 సంవత్సరాల సమయం పడుతుందని వెల్లడించిన నేపథ్యంలో రవిశంకర్ స్పందించారు. ఆయన స్పందన బాధ్యతా రాహిత్యమని ట్రైబ్యునల్ నేడు తలంటింది.