: లోకేష్ గురించి చెప్పాలంటే మా జబర్దస్త్ కామెడీ షో కూడా చాలదు: రోజా
చంద్రబాబు కుమారుడు లోకేష్ బాబు గురించి చెప్పాలంటే, తాను న్యాయనిర్ణేతగా ఉన్న జబర్దస్త్ కామెడీ షో కూడా సరిపోదని వైకాపా ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆమె, పంచాయితీ రాజ్ శాఖ కావాలని మీరు ఎందుకు కోరుకున్నారని ప్రశ్నిస్తే, తాగు నీటి సమస్యను సృష్టించడానికే మంత్రిని అయ్యానని ఆయన చెప్పడం... నిజంగా ఏదో ఫ్లోలో చెప్పాడని అనుకున్నా, అదే ఆయన మనసులో ఉన్న మాటని అందరూ తెలుసుకోవాలని అన్నారు.
తన తండ్రి పుట్టిన చిత్తూరు జిల్లాకు, కనీసం ఆయనను గెలిపిస్తున్న కుప్పంకు నీరివ్వలేని పరిస్థితి నెలకొందని, తనకు పిల్లనిచ్చిన మామ బాలకృష్ణ సొంత నియోజకవర్గం హిందూపురానికి నీరివ్వలేని లోకేష్ బాబు, రాష్ట్రమంతటికీ నీరిస్తామని జోకులు చెబుతున్నారని, ఇది సిగ్గు చేటని అన్నారు. హంద్రీనీవా, గాలేరు - నగరిని వెంటనే పూర్తి చేసి సీమ ప్రాంతానికి నీరివ్వాలని డిమాండ్ చేశారు. తన సొంత జిల్లాకు నీరివ్వలేని నీటి పారుదల మంత్రి దేవినేని ఉమ, పులివెందులకు, సీమలోని గ్రామాలకు నీరిస్తున్నామని చెప్పి జనాల చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు.