: ఓటేస్తే రసీదు వస్తే ఓకే.. కొత్త ఈవీఎంలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల చుట్టూ వివాదం నెలకొన్న నేపథ్యంలో ఓటు వేయగానే రసీదు వచ్చే ఈవీఎంల వినియోగానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈమేరకు కొత్త ఈవీఎంల కొనుగోలుకు రూ.3 వేల కోట్లు విడుదల చేసేందుకు అంగీకరించింది. ఈ విషయమై త్వరలోనే ఆర్థిక శాఖామంత్రి అరుణ్ జైట్లీ నుంచి అధికారిక ప్రకటన విడుదల కానుంది.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి ఈవీఎంలపై వివాదం రాజుకుంది. వాటిని ట్యాంపరింగ్ చేయడం వల్లే బీజేపీ గెలిచిందంటూ విపక్షాలు ఆరోపణలు గుప్పించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది. ఓటరు ఓటు వేయగానే రసీదు వచ్చే కొత్త రకం ఈవీఎంల కొనుగోలుకు అంగీకరించింది. ప్రస్తుతం వినియోగిస్తున్న ఈవీఎంలపై 2013లోనే  సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసును విచారించిన కోర్టు 2019 ఎన్నికల్లో ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ)లు కలిగిన కొత్త ఈవీఎంలను ఉపయోగించాలని ఆదేశించింది. ఈ ఈవీఎంలలో ఓటు వేయగానే వేసినట్టు రసీదు వస్తుంది. సుప్రీం తీర్పుపై స్పందించిన ఎన్నికల కమిషన్ కొత్త ఈవీఎంలకు ఆర్డర్ చేసేంత సమయం లేదని కోర్టుకు తెలిపింది.

తాజాగా ఈవీఎంల చుట్టూ ముసురుకున్న వివాదం ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం మరోమారు తెరపైకి వచ్చింది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, బీఎస్పీ చీఫ్ మాయావతి తదితరులు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అప్‌గ్రేడెడ్ ఈవీఎంలను వినియోగించాలని, లేదంటే బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన సుప్రీంకోర్టు వీవీపీఏటీ మిషన్ల వినియోగంలో ఆలస్యం ఎందుకో చెప్పాలంటూ ఎన్నికల కమిషన్, కేంద్రాన్ని గతవారం ప్రశ్నించింది. దీంతో స్పందించిన కేంద్రం కొత్త ఈవీఎంల కొనుగోలుకు ఓకే చెప్పింది.

  • Loading...

More Telugu News