: మా యుద్ధ నౌకలు ప్రస్తుతం ఉత్తర కొరియా వైపు వెళ్లడం లేదు: అమెరికా
తమ దేశానికి చెందిన విన్సన్ యుద్ధ వాహక నౌక పెద్ద మొత్తంలో ఆయుధాలతో, యుద్ధ విమానాలతో ఉత్తర కొరియా వైపు వెళుతున్నట్లు ఇటీవలే అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే. సిరియా, ఆఫ్ఘనిస్థాన్‌లలో అమెరికా దాడులు జరిపిన నేపథ్యంలో ఉత్తర కొరియాను కూడా హెచ్చరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు ఈ నౌక బయలుదేరినట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే, ఆ యుద్ధనౌకలపై అమెరికా ఈ రోజు మరో విధంగా ప్రకటన చేసింది. ప్రస్తుతం అది ఉత్తర కొరియా వైపు వెళ్లడం లేదని, సరిగ్గా దానికి వ్యతిరేక దిశకు వెళ్లినట్లు పేర్కొంది. ఉత్తరకొరియా విషయంలో మనసు మార్చుకున్న అమెరికా నేవీ దళం ప్రస్తుతం ఆ నౌకను పశ్చిమ పసిఫిక్ ప్రాంతం వైపునకు మళ్లించినట్లు తెలుస్తోంది.