: టీఆర్ఎస్ ప్లీనరీకి హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయద్దు.. నిబంధనలు అతిక్రమించవద్దు: కేటీఆర్


హైద‌రాబాద్ శివారులోని కొంపల్లిలో ఎల్లుండి నిర్వహించబోయే టీఆర్‌ఎస్ ప్లీనరీకి స‌ర్వం సిద్ధ‌మైంద‌ని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఈ ప్లీనరీకి దాదాపు 15 వేల మంది హాజ‌ర‌వుతార‌ని చెప్పారు. ప్లీనరీ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ పరిధిలో హోర్డింగ్‌లు, కటౌట్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని, నిబంధనలు అతిక్రమించరాద‌ని తెలిపారు. ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు ప్లీన‌రీ ప్రారంభమవుతుందని తెలిపారు. ఆ సమయానికే ముఖ్య‌మంత్రి కేసీఆర్, ఇతర ప్రజాప్రతినిధులు అక్క‌డ‌కు చేరుకుంటారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ పార్టీ జెండా ఆవిష్కరించి స‌మావేశాన్ని ప్రారంభిస్తార‌ని, అనంత‌రం తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తామ‌ని చెప్పారు. అదే రోజు త‌మ పార్టీ అధ్యక్షుడి పేరును హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రకటిస్తారని చెప్పారు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజన విరామం ఉంటుంద‌ని, సాయంత్రం 5 గంటల సమయంలో కేసీఆర్ ముగింపు ప్ర‌సంగం త‌రువాత‌ స‌మావేశం ముగుస్తుందని చెప్పారు.

ప్లీనరీ సందర్భంగా ఐదెకరాల్లో సభా ప్రాంగణం ఏర్పాటు చేశామని కేటీఆర్ తెలిపారు. ప్రజా ప్రతినిధులు, కళాకారులు, మీడియాకు స‌మావేశంలో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశామ‌ని అన్నారు.  ప్లీన‌రీ స‌మావేశ ప్రాంగ‌ణంలో మెడికల్ వసతి, ఆరు అగ్నిమాపక యంత్రాలను కూడా ఉంచామని చెప్పారు. ప్లీనరీకి వచ్చే వారందరికీ ప్రత్యేక పాస్‌లు ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చే వారందరికీ ప్లీనరీ ప్రాంగణం వద్ద ప్రత్యేక పాస్‌లు జారీ చేసేందుకు చర్యలు చేపట్టారని అన్నారు. సభ‌కు వచ్చే వారందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 31 జిల్లాల నుంచి ప్లీనరీకి వచ్చే వాహనాలన్నీ ఔటర్ రింగ్ రోడ్డు ద్వారానే వస్తాయని తెలిపారు. కేటాయించిన స్థ‌లాల్లోనే పార్కింగ్ చేసి, పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News