: హైదరాబాద్ లోని పలు హోటళ్లలో కుళ్లిన మాంసం, పాడైపోయిన ఆహార పదార్థాలు.. జరిమానా
హైదరాబాద్ నగరంలోని హోటళ‍్లపై జీహెచ్‌ఎంసీ ప్రజారోగ‍్య శాఖ అధికారులు విస్తృతంగా దాడులు కొనసాగిస్తూ ప్రమాణాలు పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని రోజులుగా నగరంలోని ఎన్నో హోటళ్లలో అధికారులు నాణ్యతలేని ఆహారపదార్థాలను గుర్తించిన విషయం తెలిసిందే. సోదాలు నిర్వహించిన కొద్దీ హోటళ్లలో నాణ్యతలేని ఆహారపదార్థాలు బయటపడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రోజు నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లోని హోటళ్లలో అధికారులు విస్తృతంగా తనిఖీలు చేశారు. అక్కడి శివాని హోటల్‌లో తనిఖీలు నిర్వహించిన అధికారులు పాచిపోయిన ఆహార పదార్థాలను నిల‍్వ ఉంచినట్లు కనుగొని, యాజమాన‍్యానికి రూ.10 వేలు జరిమానా విధించారు. ఆ హోటల్‌లో పాడైపోయిన ఆహార పదార్థాలు, కుళ్లిన మాంసం ఉన్నట్లు చెప్పారు.
ఇక దిల్‌సుఖ్‌నగర్‌లోని గ్రీన్ బావర్చి హోటల్, శిల్పి హోటళ‍్లు కూడా ప్రమాణాలు పాటించడంలేని గుర్తించిన అధికారులు ఆయా హోటళ్లకు రూ.5 వేల చొప్పున జరిమానా వేశారు. ఆ హోటళ్ల వంటగది అపరిశుభ్రంగా ఉందని చెప్పారు. అలాగే హోటల్ బృందావనంలో అధికారులు పాడైన పదార్థాలను గుర్తించి, యాజమాన్యానికి రూ.5 వేల జరిమానా వేశారు.