: మగవేషంలో ఫుట్ బాల్ మ్యాచ్ చూసేందుకు స్టేడియంకి వెళ్లిన 8 మంది అమ్మాయిలు బుక్కయ్యారు!
ఫుట్ బాల్ పై పెంచుకున్న అభిమానం సంప్రదాయాలు, కట్టుబాట్లు దాటేలా చేసి, 8 మంది యువతులను ఇబ్బందులపాలు చేసిన ఘటన ఇరాన్ లో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...ఇస్లాం చట్ట ప్రకారం ఇరాన్ లో ముస్లిం మహిళలు లైవ్ గా మ్యాచ్ లను వీక్షించేందుకు వీల్లేదు. అయితే ఇరాన్ లోని టెహ్రాన్ లోని ఆజాదీ స్టేడియంలో ఫుట్ బాల్ మ్యాచ్ నిర్వహించారు. ఫుట్ బాల్ పై ఉన్న అభిమానంతో మ్యాచ్ ను ఎలాగైనా లైవ్ లో వీక్షించేందుకు 8 మంది యువతులు పెను సాహసానికి పూనుకున్నారు. అచ్చం మగాళ్లలా తయారయ్యారు. స్టేడియంలోకి వచ్చేశారు. అయితే అనుమానం వచ్చిన టెహ్రాన్ ఆజాది స్టేడియంలోని అధికారులు వారిని పరీక్షించి, మహిళలేనని నిర్ధారించుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.
గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడంతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశామని, మహిళల రక్షణ కోసమే వారిని లైవ్ మ్యాచ్ లకు దూరంగా ఉంచుతున్నామని వారు తెలిపారు. అంతేకాదు, ఇరాన్ లో మహిళలు సైక్లింగ్ చేయడం కూడా నేరమే...అయితే ఈ మధ్యే కొంతమంది యువతుల టీమ్ సైక్లింగ్ ధైర్యంగా నేర్చుకుని చట్టాలు, సంప్రదాయానికి ఎదురీదుతూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే ప్రయత్నం చేస్తున్నారు. వారికి నిత్యం ఉగ్రవాదుల నుంచి హెచ్చరికలు వస్తూనే ఉన్నాయని తెలుస్తోంది. అయితే ప్రాణాల మీద తీపితో ఇష్టాలను వదులుకోలేమని, ఎవరికో భయపడి ఇష్టాలను వదులుకోవడం మానసికంగా చావడం రెండూ ఒకటేనని గతంలో సైక్లింగ్ చేస్తున్న మహిళలు పేర్కొన్నారు.