: డేటావిండ్ లో సంక్షోభం... శంషాబాద్ కార్యాలయం ఎదుట ఉద్యోగుల ధర్నా
తక్కువ ధరలకు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్ టాప్ లను మార్కెటింగ్ చేస్తున్న భారత సంస్థ డేటా విండ్ ఇప్పుడు సంక్షోభంలో పడింది. తమకు మూడు నెలలుగా వేతనాలు ఇవ్వడం లేదని ఆరోపిస్తూ, శంషాబాద్ లోని సంస్థ కార్యాలయం ఎదుట ఈ ఉదయం ఉద్యోగులు ఆందోళనకు దిగారు. ఇటీవలి కాలంలో ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఉద్యోగులను తొలగిస్తున్నారని ఆరోపించారు. తమకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. సంస్థ కార్యాలయం వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, సంస్థలో ఎలాంటి సంక్షోభం లేదని కంపెనీ యాజమాన్య ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వేతన బకాయిలు చెల్లించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు.