: 457 వీసా అంటే ఏమిటి?.. భారతీయులపై దీని ప్రభావం ఎంత?
457 వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రధాని మాల్కం టర్న్ బుల్ తీసుకున్న నిర్ణయం భారతీయులను కలవరపరుస్తోంది. ఆస్ట్రేలియా విషయానికి వస్తే... విస్తీర్ణపరంగా ఆ దేశం చాలా పెద్దది. అయినప్పటికీ జనాభా మాత్రం కేవలం 2.4 కోట్లు మాత్రమే. ఈ నేపథ్యంలో, వివిధ ఉద్యోగాలకు స్థానికులు లభించకపోతే... ఆ స్థానంలో విదేశీయులను తెప్పించుకోవచ్చు. ఇందుకు ఉపయోగపడేదే 457 వీసా. ఈ వీసా కాలపరిమితి నాలుగేళ్లు ఉంటుంది. 200 పైచిలుకు ఉద్యోగాలను ఈ వీసా ద్వారా భర్తీ చేయవచ్చు. ఇందులో నుంచి 180 రకాల ఉద్యోగాలను తొలగించారు. ఈ కొత్త విధానం ఈ రోజు నుంచే అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం 95,757 మంది విదేశీయులు ఈ వీసాలపై ఆస్ట్రేలియాలో పని చేస్తున్నారు. వీరిలో అత్యధికులు భారతీయులు కాగా... బ్రిటన్, చైనాలు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి.
ఈ వీసాలను రెండు విభాగాలుగా విభజించారు. తాత్కాలిక ఉద్యోగ వీసాను కేవలం రెండేళ్లకే పరిమితం చేశారు. ఈ వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి ఆంగ్ల భాషపై పట్టు ఉండాలి. పర్మినెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకోవడానికి ఈ వీసాదారులు అనర్హులు. నాలుగేళ్ల వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి ఉద్యోగ నైపుణ్యం ఉండాలి. రెండు రకాల వీసాలకు మూడేళ్ల గత అనుభవం తప్పనిసరి చేశారు. అంతేకాదు, దరఖాస్తు చేసే సమయానికి అభ్యర్థికి 45 ఏళ్ల లోపు వయసు ఉండాలి. వార్షిక వేతనం కనిష్టంగా 53,900 డాలర్లు ఉండాలి.