: తమిళనాడు సంక్షోభంలో మా పాత్ర లేదు: వెంకయ్యనాయుడు
తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల వెనుక బీజేపీ, కేంద్రం పాత్ర ఎంతమాత్రమూ లేవని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, అన్నాడీఎంకేలో జరుగుతున్న నాటకీయ పరిణామాలతో తమకు సంబంధం లేదని, అసలా రాష్ట్ర రాజకీయాలపైనే తమకు ఆసక్తి లేదని అన్నారు.
సంక్షోభమంతా అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారమని, జయలలిత కోసమైనా ఎమ్మెల్యేలంతా కలిసుండాలన్నది తన అభిమతమని అన్నారు. ఇక విజయ్ మాల్యా అరెస్టు, ఆపై బెయిల్ లభించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆయన్ను ఇండియాకు రప్పించేందుకు అవసరమైన అన్ని చర్యలనూ తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మాల్యాను భారత చట్టం ముందు నిలుపుతామన్న నమ్మకముందని అన్నారు.