: అంత ధైర్యముందా? కొమ్ములు మొలుచుకొచ్చాయా?: దినకరన్ ఆగ్రహం


అన్నాడీఎంకేలో నిన్న వేకువజామున 2 గంటల నుంచి హైడ్రామా నడిచింది. శశికళను కలవడానికి బెంగళూరు వెళ్లిన దినకరన్ నిన్న ఉదయం 2 గంటలకు చెన్నై చేరుకున్నారు. వెంటనే తన అనుచరులతో మంతనాలు సాగించారు. తాను బెంగళూరు వెళ్లిన సమయంలో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం, ఉదయం 9.30 గంటలకు అన్నాడీఎంకే కార్యాచరణ కమిటీ దినకరన్ ఇంటికి వెళ్లింది. పార్టీ సమావేశంలో జరిగిన చర్చల సారాంశాన్ని దినకరన్ కు వివరించింది. మీ అంతట మీరే పార్టీకి రాజీనామా చేస్తారా? లేదా మమ్మల్నే తప్పించమంటారా? అని ప్రశ్నించారు.

దీంతో, దినకరన్ ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి అయిన తనకే తెలియకుండా, తన ఆదేశాలు లేకుండానే సమావేశం ఎలా నిర్వహించారంటూ కార్యాచరణ కమిటీ సభ్యులపై ఆయన నిప్పులు చెరిగారు. అడిగిన వారందరికీ మంత్రి పదవులు ఇచ్చానని, కోరిన కోరికలన్నీ తీర్చానని... అయినా ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు. దీని వెనుక ఎవరున్నారు? ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఇదంతా ఎందుకు చేయాల్సి వస్తోంది? అని ప్రశ్నించారు.

పార్టీ నుంచి మమ్మల్నే తొలగించాలనుకుంటారా? అంత దమ్ముందా? కొత్తగా కొమ్ములు మొలిచాయా? అంటూ దినకరన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారట. పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది తమవారే అని, ఆ విషయాన్ని మీరు మర్చిపోతున్నారని హెచ్చరించారు. అయితే, దినకరన్ వ్యాఖ్యల్ని ముఖ్యమంత్రి పళనిస్వామి, మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలు ఏమాత్రం ఖాతరు చేయలేదు. మన్నార్ గుడి వర్గాన్ని పార్టీ నుంచి సమూలంగా తరిమివేసేందుకు వారు వడివడిగా అడుగులు వేస్తున్నారు. 

  • Loading...

More Telugu News