: లేటు వయసులో ఇబ్బందులు... బాబ్రీ కేసులో అద్వానీపై తిరిగి విచారణకు సుప్రీం ఆదేశాలు
ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో బీజేపీ నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో సీనియర్ నేతలు ఎల్ కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి తదితరులను తిరిగి విచారించాలని ఈ ఉదయం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలో అద్వానీని విచారణ నుంచి అలహాబాద్ హైకోర్టు మినహాయించిన సంగతి తెలిసిందే. ఆపై విచారణ అధికారులు, ఘటన వెనుక అద్వానీ ప్రమేయం ఉందని, కరసేవకులకు ఆయన సహకరించారని ఆరోపిస్తూ, కేసును కొనసాగించేందుకు ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం, అద్వానీ సహా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరిపైనా విచారణకు పచ్చజెండా ఊపుతూ తీర్పిచ్చింది. లక్నోలోని ట్రయల్ కోర్టులో విచారణను రెండేళ్లలో ముగించాలని ఆదేశించిన న్యాయమూర్తి, బీజేపీ నేత కల్యాణ్ సింగ్ కు మాత్రం విచారణ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు.