: 457 వీసా ప్రోగ్రాంను ఆస్ట్రేలియా ఎందుకు రద్దు చేసింది?
భారతీయ ఐటీ నిపుణులకు టైమ్ బాగున్నట్టు లేదు. ఓవైపు హెచ్-1బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కు పాదం మోపితే... మరోవైపు ఆయన బాటలోనే ఆస్ట్రేలియా సైతం నడిచింది. 457 వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేసింది. ఈ వీసా ప్రోగ్రామ్ ను ఆసీస్ రద్దు చేయడానికి కారణం ఇదే. వాస్తవానికి ఆస్ట్రేలియాలో పని చేయడానికి అవసరమైనంత మంది ఆ దేశంలోనే ఉన్నారు. కానీ, విదేశీయులు (ముఖ్యంగా భారతీయులు) తక్కువ వేతనంతోనే పనిచేయడానికి అందుబాటులో ఉంటుండటంతో... ఈ వీసాల కింద విదేశీయులను ఆస్ట్రేలియా కంపెనీలు రప్పిస్తున్నాయి. దీంతో, స్థానిక ఆస్ట్రేలియన్లకు ఉద్యోగ భద్రత కరవైంది. ఆస్ట్రేలియన్లకు దక్కాల్సిన ఉద్యోగాలు విదేశీయులు తన్నుకుపోతున్నారనే భావన అక్కడి ప్రజల్లో ఎక్కువైంది.
ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి మాల్కం టర్న్ బుల్ కూడా తెలిపారు. మా వారికి దక్కాల్సిన ఉద్యోగాలను విదేశీయులు తన్నుకుపోవడాన్ని తాము అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. అందుకే 457 వీసా ప్రోగ్రామ్ ను రద్దు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. మరో విషయం ఏమిటంటే, ఈ వీసాలపై ఆస్ట్రేలియాలో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల్లో అధిక శాతం మంది భారతీయులే కావడం బాధాకరం. దాదాపు 95 వేల మంది ఉద్యోగులు ఈ వీసాలపై పని చేస్తున్నట్టు సమాచారం.