: కోహ్లీ పంపిన జెర్సీని ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో దాచి పెట్టుకున్న షాహిద్ అఫ్రిదీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పంపిన జెర్సీని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ ఫ్రేమ్ కట్టించుకుని ఇంట్లో పెట్టుకోవడం ఆసక్తి రేపుతోంది. షాహిద్ అఫ్రిదీ పాకిస్థాన్ లో ఈ మధ్యే కొత్తగా ఇల్లు కట్టించుకున్నాడు. ఈ సందర్భంగా క్రికెట్ లో తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న జ్ఞాపికలన్నింటినీ జాగ్రత్తగా భద్రపరచుకున్నాడు. భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన ‘18’ నంబర్ జెర్సీని విరాట్ కోహ్లీ ఈ మధ్యే అఫ్రిదీకి కానుకగా ఇచ్చాడు.
ఈ సందర్భంగా కోహ్లి ‘షాహిద్ భాయ్, అభినందనలు. మైదానంలో నీతో తలపడటం ఎప్పుడైనా ప్రత్యేకమే’ అంటూ వ్యాఖ్యను జోడించాడు. దీనిని ఆఫ్రిది ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకున్నాడు. కాగా, భారత్, పాక్ సరిహద్దుల్లో తుపాకులు గర్జించినట్టే క్రికెటర్ల మధ్య కూడా మాటల తూటాలు పేలుతుంటాయి. అయితే మైదానం వీడితే మాత్రం రెండు దేశాల క్రికెటర్ల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వసీం అక్రమ్, షోయబ్ అఖ్తర్ వంటి క్రికెటర్లకు సెహ్వాగ్, రవిశాస్త్రి, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ వంటి మంచి స్నేహితులు ఉన్నారన్న సంగతి తెలిసిందే.