: మీ అభిప్రాయాలు మీవి... నా అభిప్రాయం నాది... నేను నా మాటమీద నిలబడుతున్నాను: సోను నిగమ్
మసీదులు, దేవాలయాల్లో లౌడ్ స్పీకర్లపై నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కు తీసుకునే ప్రసక్తే లేదని ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోను నిగమ్ మరోసారి ట్వీట్ చేశారు. తన ట్వీట్స్ పై భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం పట్ల ఆయన స్పందించారు. తనను విమర్శించే వారిని దృష్టిలో పెట్టుకుని చేసిన ట్వీట్ లో ఆయన... ‘మీ ట్వీట్స్ మీ ఐక్యూను తెలుపుతున్నాయి. దేవాలయాలు, మసీదుల్లో లౌడ్ స్పీకర్లు అనుమతించకూడదన్న నా వాదనపైనే నేను ఇప్పటికీ నిలబడుతున్నా’ అంటూ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ తన వ్యాఖ్యలపై సానుకూలంగా స్పందించడాన్ని ఆయన ఈ సందర్భంగా ఆహ్వానించారు.
మరోవైపు గాయకుడు వాజిద్ ఖాన్ తనను విమర్శిస్తూ చేసిన ట్వీట్ పై కూడా ఆయన స్పందిస్తూ...‘డియర్ వాజిద్ ఖాన్ ఒక్కసారి నువ్వు ముస్లింగా ఉండటం మానేసి ఓ సాధారణ భారత పౌరుడిగా ఉండు. అప్పుడు నీకు అందరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుస్తుంది’ అంటూ ట్వీట్ చేశాడు. అందరి అభిప్రాయాలపై ఆయన ట్వీట్ చేస్తూ, మీ అభిప్రాయాలు మీవి, నా అభిప్రాయం నాది అని ఆయన స్పష్టం చేశారు.