: పోలీస్‌స్టేషన్‌లోనే మహిళను కాల్చి చంపిన కసాయి!
ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనకు బయట ఎక్కడా రక్షణ దొరకడం లేదని స్థానిక పోలీస్‌స్టేషన్‌లో తలదాచుకున్న ఓ మహిళ అక్కడ కూడా రక్షణ పొందలేకపోయింది. పోలీసులు చూస్తుండగానే ఓ వ్యక్తి ఆ మహిళను కాల్చి చంపాడు. మెయిన్‌పురికి చెందిన రెండు కుటుంబాల మధ్య భూముల విషయంలో నిన్న రాత్రి గొడవ చెలరేగింది. ఈ క్రమంలోనే తుపాకీ పట్టుకొని వచ్చిన ఓ వ్యక్తి ఓ మహిళను చంపడానికి ప్రయత్నించాడు. అతడి నుంచి తప్పించుకొని పారిపోయిన ఆమె.. పోలీస్ స్టేషన్లోకి వెళ్లింది.
ఆమె వెనుక కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. అయితే, పోలీస్‌స్టేషన్‌లోకి కూడా దూసుకొచ్చిన ఆ వ్యక్తి ఆమెపై కాల్పులు జరపడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. అనంతరం ఆ వ్యక్తి పారిపోవడానికి ప్రయత్నించగా అతడిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.