: శశికళను కలిసేందుకు వెళ్లకుండా ఇంటికే పరిమితమైన దినకరన్!
నేడు బెంగళూరుకు వెళ్లి పరప్పన అగ్రహార జైల్లోని శశికళను కలిసి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించాలని భావించిన టీటీవీ దినకరన్, తన కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఈ ఉదయమే ఆయన బెంగళూరు వెళతారని వార్తలు వచ్చినప్పటికీ, ఆయన ఇంటికే పరిమితమయ్యారు. రేపు ఫెరా కేసులో మద్రాస్ హైకోర్టులో హాజరు కావాల్సి వుండటం, తనను విచారించేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు నేడు రావట్లేదని తెలియడంతో, ఆయన తన న్యాయవాదులతో మంతనాలతోనే కాలం గడుపుతున్నారు. కాగా, రేపు కోర్టు తీర్పు అనంతరం ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ లోగానే ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేయాలని నిర్ణయించుకున్న దినకరన్, ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.