: అధికారిక లాంఛనాలతో దేవినేని అంత్యక్రియలు పూర్తి... హాజరైన సీఎం, మంత్రులు
విజయవాడలోని గుణదలలో టీడీపీ నేత దేవినేని నెహ్రూ వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి. దేవినేని నెహ్రూ బతికి ఉండగా, తనకు అనుకోనిది ఏదైనా జరిగితే గుణదలలోని రైల్వే ట్రాక్ కు దగ్గర్లో ఉన్న అరఎకరం వ్యవసాయక్షేత్రంలో తన అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులతో పలు సందర్భాల్లో చెప్పినట్టు తెలుస్తోంది. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు ఆయన వ్యవసాయక్షేత్రంలో నిర్వహించారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి.
కాగా, ఆయన పార్థివ దేహాన్ని కడసారి సందర్శించేందుకు భారీ ఎత్తున అనుచరులు, అభిమానులు తరలివచ్చారు. అయితే ముఖ్యమంత్రి రావడంతో ఆయన వచ్చేవరకు అంత్యక్రియలు ఆపారు. అనంతరం సీఎం చంద్రబాబు వ్యవసాయ క్షేత్రానికి వచ్చి దేవినేని నెహ్రూ భౌతిక కాయానికి పుష్పగుచ్ఛంతో నివాళులర్పించారు. అనంతరం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ అంత్యక్రియలకు సీఎం చంద్రబాబునాయుడుతో పాటు, మంత్రులు దేవినేని ఉమ, కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర తదితరులతో పాటు ఎమ్మెల్యేలు బొండా ఉమ తదితరులు హాజరయ్యారు.