: ఉత్కంఠభరిత హోరాహోరీ మ్యాచ్ లో కోల్ కతా విజయం!


ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానం వేదికగా జరిగిన ఐపీఎల్ 18వ మ్యాచ్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీకి ఓపెనర్లు సంజూ శాంసన్‌ (39), శామ్‌ బిల్లింగ్స్‌ (21) శుభారంభం ఇచ్చారు. అనంతరం కరుణ్‌ నాయర్‌ (21) ఐపీఎల్ లో తొలిసారి ఫర్వాలేదనిపించగా, శ్రేయస్‌ అయ్యర్‌ (26) ఆకట్టుకున్నాడు. రిషబ్‌ పంత్‌ (38) ధాటిగా ఆడి స్కోరు బోర్డు వేగం పెంచాడు. క్రిస్‌ మోరిస్‌ (16) మెరుపులు మెరిపించడంతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుకు ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్ షాకిచ్చాడు. తొలి రెండు ఓవర్లలో గ్రాండ్ హోం (1), కెప్టెన్ గౌతమ్ గంభీర్ (14) ను పెవిలియన్ కు పంపి హెచ్చరికలు పంపాడు. అనంతరం ఊతప్ప (4) ను కుమ్మిన్స్ అవుట్ చేశాడు.

అనంతరం క్రీజులోకి వచ్చిన యూసుఫ్ పఠాన్ (59), మనీష్ పాండే (69) అద్భుతమైన అర్ధసెంచరీలతో జట్టును ఆదుకున్నారు. పఠాన్ పెవిలియన్ చేరగా, వచ్చిన సూర్యకుమార్ యాదవ్ విఫలమయ్యాడు. దీంతో వోక్స్ (2) ఆకట్టుకున్నాడు. చివర్లో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో ఆకట్టుకుని, మెరుపు ఫీల్డింగ్ చేసినా మ్యాచ్ ఉత్కంఠగా సాగింది తప్ప విజయం సిద్ధించలేదు. చివరి ఓవర్ ను అమిత్ మిశ్రా అద్భుతంగా సంధించాడు. తొలి బంతిని డాట్ బాల్ గా సంధించిన మిశ్రా, రెండో బంతికి వోక్స్ (3) ను అవుట్ చేశాడు. మూడో బంతికి సునీల్ నరైన్ (1) సింగిల్ తీశాడు. తరువాతి బంతిని మనీష్ పాండే సిక్సర్ కొట్టాడు. తరువాతి బంతికి రెండు పరుగులు తీయడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు చివరి బంతి మిగిలి ఉండడంతో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా మనీష్ పాండే నిలిచాడు. 

  • Loading...

More Telugu News