: దేవినేని నెహ్రూ మృతి పార్టీకి తీరని లోటు: చంద్రబాబు
టీడీపీ నేత దేవినేని నెహ్రూ మృతి పార్టీకి తీరని లోటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. విజయవాడలోని దేవినేని నెహ్రూ నివాసానికి వెళ్లిన చంద్రబాబు, నెహ్రూ మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దేవినేని నెహ్రూ లేని లోటు తీర్చలేమని అన్నారు. తనను నెహ్రూ ఈ మధ్య కాలంలో చాలా సార్లు కలిశారని అన్నారు. ఆయన వైరల్ ఫీవర్ తో ఆసుపత్రికి వెళ్లారని, ఈ తెల్లవారు జామునే హార్ట్ అటాక్ కు గురయ్యారని తనకు మెసేజ్ వచ్చిందని, దీంతో తాను వైద్యసిబ్బందికి సూచనలు చేసేలోపు మరోమెసేజ్ వచ్చిందని, అందులో ఆయన మృతి చెందినట్టు ఉందని ఆయన తెలిపారు.
విధి చాలా బలీయమైనదని, ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేమని అన్నారు. పార్టీలో విభేదాలు, వివాదాలు ఉండకూడదని దేవినేని నెహ్రూ కోరుకున్నారని, విభేదాలు వచ్చినా, వాటిని సరిచేసేందుకు ఆయన ముందు ఉండేవారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆయన కుమారుడు ఆయన లక్ష్యాల సాధనలో పని చేస్తారని ఆయన అన్నారు. విజయవాడ రాజకీయాల్లో నెహ్రూ తనదైన ముద్ర వేశారని ఆయన తెలిపారు. ఆయన ఆశయసాధనకు పని చేస్తామని, తన సహాయసహకారాలు దేవినేని కుటుంబానికి ఎప్పుడూ ఉంటాయని ఆయన తెలిపారు.