: అమ్మలేక నరకం అనుభవించా.. తొలిసారి మనసు విప్పిన ప్రిన్స్ హ్యారీ!
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ విలియమ్ సోదరుడు, దివంగత ప్రిన్సెస్ డయానా చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ తొలిసారి మీడియాతో మనసు విప్పాడు. సాధారణంగా మీడియాకు దూరంగా ఉండే ప్రిన్స్ హ్యారీ... తొలిసారి తల్లితో తన అనుబంధాన్ని వివరించాడు. ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో అయినా అమ్మ అమ్మేనని ప్రిన్స్ హ్యారీ అన్నాడు. లెక్కలేనంత డబ్బు, కొండంత బంగారం, కాలు కిందపెట్టనీయనంత మంది అనుచరగణం.. ఇలా ఎన్ని ఉన్నా ఒక్క తల్లిలేని లోటు ముందు అవన్నీ దిగదుడుపేనని హ్యారీ తెలిపాడు. తన తల్లి ప్రిన్సెస్ డయానా లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని బాధగా అన్నాడు.
తన పన్నెండేళ్ల వయసులో 1997లో తన తల్లి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని, అప్పటి నుంచి నరకం అనుభవించానని హ్యారీ వెల్లడించాడు. కొన్ని వేల సార్లు తనలో తాను కుమిలిపోయానని హ్యారీ తెలిపాడు. ప్రతిక్షణం తన తల్లే తనకు గుర్తుకొచ్చేదని, ఎలా మర్చిపోవాలో తెలిసేది కాదని, కొన్నిసార్లు తన తల్లిని మర్చిపోవాలని బలంగా అనుకునేవాడినని, అయితే కొంత సేపటి తరువాత మళ్లీ మామూలేనని, తన తల్లి గుర్తుకొచ్చి కుమిలిపోయేవాడినని తెలిపాడు. తన తల్లి బాధ నుంచి బయటకు వచ్చేందుకు తన సోదరుడు ప్రిన్స్ విలియమ్ సహాయం చేసి, తనకు అండగా నిలబడేవాడని తెలిపాడు. 28 ఏళ్ల వయసులో కూడా మానసిక నిపుణుల వద్ద కౌన్సిలింగ్ తీసుకున్నట్లు వివరించారు. కాగా, ప్రస్తుతం పిన్స్ హ్యారీ వయసు 32 ఏళ్లు.