: పెళ్లి చేసుకోవడానికి వెళుతున్న జంటను దించేసిన యునైటెడ్ ఎయిర్ లైన్స్... మళ్లీ విమర్శల తుపాను!
టికెట్ కొనుక్కున్న ఓ ప్రయాణికుడిని సీట్లోంచి బలవంతంగా లాక్కెళ్లి దించేసిన ఘటన యునైటెడ్ ఎయిర్ లైన్స్ పై తీవ్ర విమర్శలకు కారణం కాగా, ఇప్పటికీ, ఆ విమానం సిబ్బంది తమ తీరును మార్చుకోలేదు. తాజాగా మైఖేల్ హోల్హ్ అనే యువకుడు, అతని కాబోయే భార్య అంబర్ మాక్స్ వెల్ తమ వివాహ వేడుక నిమిత్తం హూస్టన్ నుంచి కోస్టారికాకు యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకోగా, వారిని బలవంతంగా దించేశారు. దీనికి సంబంధించిన వీడియో కూడా బయటకు వచ్చింది.
జరిగిన ఘటనపై ఎయిర్ లైన్స్ యాజమాన్య సంస్థ యునైటెడ్ కాంటినెంటల్ హోల్డింగ్స్ ఇంకా స్పందించనప్పటికీ, ఈ జంట తమకు కేటాయించిన సీట్లలో కాకుండా, ఖాళీగా ఉన్న కాస్త ఖరీదు ఎక్కువైన సీట్లలో కూర్చోవడంతోనే కిందకు దించినట్టు తెలుస్తోంది. తాము విమానాన్ని చివరిగా ఎక్కామని, అప్పటికే తమ సీట్లలో ఓ వ్యక్తి అడ్డంగా పడుకొని నిద్రపోతుండటంతో, ఖాళీగా ఉన్న సీట్లలో కూర్చున్నామని మైఖేల్ హోల్హ్ వెల్లడించారు. ఆపై కాసేపటికే క్యాబిన్ క్రూ వచ్చి తమను దించేశారని, తానేమీ ఫస్ట్ క్లాస్ సీట్లలో కూర్చోలేదని వాపోయారు. ఈ ఘటనపై దావా వేయనున్నట్టు తెలిపారు. యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో కస్టమర్ల పట్ల క్రూ వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.