: లోకేశ్ ఎదిగే నేత.. ఆయనతో విభేదాలు లేవు: సుజనా చౌదరి
నారా లోకేశ్ యువనేత అని, ఆయనతో తనకు ఎటువంటి విభేదాలు లేవని కేంద్రమంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి ‘కాంగ్రెస్’ లక్షణాలు రాలేదని, తమ పార్టీలో తనకు శత్రువులు ఎవరూ లేరని అన్నారు. అయితే, ఆశావహులు మాత్రం అప్పుడప్పుడు తనపై మట్టి పెళ్లలు వేస్తుంటారని విమర్శించారు.
టీడీపీలో తాను నంబర్ 2 కాదని, చంద్రబాబు వాదన, చంద్రబాబు బాటలోనే తాము నడుస్తామని అన్నారు. ఈ సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్ట్ కు నిధుల కొరత రాదని, పెరిగిన ఖర్చంతా కేంద్రమే ఇస్తుందని చెప్పారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగి తీరుతుందని, చట్ట సవరణా? రాజ్యాంగ సవరణ? అన్నది త్వరలోనే తేలుతుందని సుజనా చౌదరి చెప్పుకొచ్చారు.