: ఉత్తర కొరియాకు ఎదురు దెబ్బ... లక్ష్యాన్ని చేరకుండా మధ్యలోనే పేలిన క్షిపణి!
నిన్న వ్యవస్థాపక దినోత్సవం నాడు భారీ ఎత్తున ఆయుధ సంపత్తిని, అత్యాధునిక క్షిపణులను ప్రదర్శించిన ఉత్తర కొరియా, నేడు చేపట్టిన క్షిపణి పరీక్షలో విఫలమైంది. ఓ క్షిపణిని పరీక్షిస్తుండగా, అది లక్ష్యాన్ని చేరకుండానే మధ్యలో పేలిపోయిందని దక్షిణ కొరియా, అమెరికాలు ప్రకటించాయి. క్షిపణి మధ్యలోనే పేలిపోవడం కొరియాకు ఎదురుదెబ్బని, అయితే, ఇది ఏ రకమైన క్షిపణో, దీని సామర్థ్యం ఎంతో తెలియరాలేదని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఇటీవలి కాలంలో తన వద్ద ఉన్న అణ్వాయుధాలను బయటకు చూపుతూ ఉద్రిక్తతలకు ఉత్తరకొరియా తెరలేపుతుండగా, దాన్ని అడ్డుకునేందుకు రంగంలోకి దిగిన అమెరికా, దక్షిణ కొరియాకు సాయంగా యుద్ధ నౌకలను మోహరించిన సంగతి తెలిసిందే.