: అతిపెద్ద బాంబు దాడి వృథా కాలేదు.. 90 మంది ఉగ్రవాదుల హతం: ఆప్ఘనిస్థాన్ అధికారిక ప్రకటన
ఆఫ్ఘనిస్థాన్‌లోని ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరంపై అమెరికా అతిపెద్ద బాంబు జీబీయూ-43/బీ (ఎంఓఏబీ)తో దాడి చేసిన నేపథ్యంలో మొదట ఈ దాడిలో 36 మంది ఉగ్రవాదులు మాత్రమే హతమైనట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ విషయంపై ఐఎస్ఐఎస్ మాత్రం ఒక్క ఉగ్రవాది కూడా చనిపోలేదని ప్రకటించింది. దీంతో అమెరికా చేసిన దాడి వృథా అయిందని, అతి పెద్ద బాంబును వినియోగించినప్పటికీ విఫలమైందని పలు విమర్శలు వచ్చాయి.
అయితే, ఈ దాడి ఫలితాలపై ఆఫ్ఘనిస్థాన్ ప్రభుత్వం ఎట్టకేలకు అధికారికంగా ప్రకటన చేసింది. ఆ దాడి వృథా కాలేదని, సుమారు 90 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారని పేర్కొంది. దీంతో ఇస్లామిక్ స్టేట్ భారీగా దెబ్బతిందని తెలిపింది. ఈ దాడిలో ఆఫ్గాన్ సైనికులకుగానీ, సామాన్యులకు గానీ ఎలాంటి నష్టం జరగలేదని పేర్కొంది. గతంలో ఈ బాంబు దాడి జరిగిన ప్రాంతానికి సమీపంలో ప్రజలు ఉండేవారని, అయితే, ప్రస్తుతం అక్కడ వారు ఉండడం లేదని, దీంతో తమ పౌరులకి నష్టం జరగలేదని తెలిపింది.