: భారతీరాజా ఫిలిం ఇనిస్టిట్యూట్ ను ప్రారంభించనున్న రజనీ, కమల్!
దేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా కూడా ఒకరు. కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆయన, ఓ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ ప్రారంభించనున్నట్టు తమిళ సినీ వర్గాల సమాచారం. దీనికి భారతీరాజా ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సినిమా(బీఆర్ఐఐసీ) అనే పేరు ఖరారు చేశారు. ఈ ఫిలిమ్ ఇనిస్టిట్యూట్ ను తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, విలక్షణ నటుడు కమలహాసన్ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది.
కాగా, 1977లో ‘16 వయతినిలె’ చిత్రం (తెలుగులో పదహారేళ్ల వయసు) ద్వారా దర్శకుడిగా తమిళ సినీ ఇండస్ట్రీకి ఆయన పరిచయమయ్యారు. ఈ చిత్రం ద్వారా శ్రీదేవిని వెండితెరకు పరిచయం చేశారు. ఇదే చిత్రంలో రజనీకాంత్, కమలహాసన్ కూడా నటించారు. ‘16 వయతినిలె’ తర్వాత ‘కిజాక్ పోగమ్ రైల్’, ‘సిగప్పు రోజక్కల్’, ‘సోల్వసావన్’, ‘పుతియా వారుపుగల్’ వంటి ఎన్నో హిట్ చిత్రాలను ఆయన తీశారు. తెలుగులో కొత్త జీవితాలు, సీతాకోక చిలుక, యువతరం పిలిచింది, ఈ తరం ఇల్లాలు, జమదగ్ని, ఆరాధన సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు.