: హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం... క్షతగాత్రులను తన కాన్వాయ్ లో తరలించిన కేటీఆర్
హైదరాబాదులోని తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయం వద్ద నిన్న అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జీహెచ్ఎంసీ ట్రాలీ డ్రైవర్ మద్యం మత్తు కారణంగా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం పలువురిని కలచివేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... హైదరాబాద్ లోని లాలాపేటకు చెందిన ఎండీ అజార్ (37), ఇమ్రానా బేగం (35) దంపతులతో పాటు ముగ్గురు పిల్లలు ఓ కార్యక్రమానికి హాజరై, ద్విచక్రవాహనంపై ఇంటికి తిరిగి బయల్దేరారు. ఈ క్రమంలో వారి వాహనాన్ని ఆర్టీఏ కార్యాలయం వద్ద మలుపులో అకస్మాత్తుగా అతివేగంగా వచ్చిన జీహెచ్‌ఎంసీ చెత్త తరలింపు వాహనం (ఎపీ24వీ5893) బలంగా ఢీ కొట్టింది.
దీంతో ఎగిరిపడ్డ ఆజర్ (37), అమన్ (9), అశ్వియా (7), అలీనా (3) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇమ్రానా బేగం తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆమెతో పాటు మరొక బాబు కూడా తీవ్రంగా గాయపడ్డాడు. కాసేపటికి అదే దారిలో ఆర్మూర్ నుంచి వస్తున్న మంత్రి కేటీఆర్ ప్రమాద స్థలం వద్ద ఆగి, తన కాన్వాయ్ లోని ఒక వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. అనంతరం వారి వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.