: ఐఎస్ఐఎస్ స్థావరంపై అమెరికా న్యూక్లియర్ రహిత బాంబు దాడి
ఇటీవల సిరియా వైమానిక స్థావరంపై క్షిపణి దాడితో విధ్వంసం సృష్టించిన అమెరికా, ఈసారి ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ స్థావరం లక్ష్యంగా న్యూక్లియర్ రహిత అతిపెద్ద బాంబు దాడి చేసింది. ఐఎస్ఐఎస్ స్థావరాలు, సొరంగాలు, గుహలే లక్ష్యంగా అఫ్గానిస్థాన్ లో మరో భారీ దాడికి వ్యూహరచన చేసింది. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల ప్రాబల్యం అధికంగా ఉండే తూర్పు అఫ్గానిస్థాన్ లో పక్కా సమాచారంతో గురితప్పని భారీ బాంబును విడిచినట్లు అమెరికా భద్రతా విభాగం ప్రకటించింది. 9,525 కిలోల బరువు కలిగిన ఆ భారీ బాంబును యంసీ-130 ఎయిర్ క్రాఫ్ట్ నుంచి వదిలినట్లు అమెరికా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.
ఇంత భారీ బాంబుతో దాడి చేయడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. అది అణు రహిత బాంబు అని ఆయన స్పష్టం చేశారు. ఈ దాడిపై గర్విస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. గత ఎనిమిది వారాలుగా అమెరికా సైన్యం అద్భుతాలు చేస్తోందని ఆయన చెప్పారు. ఏ మూల దాక్కున్నా ఉగ్రవాదులను అంతం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 7 గంటలకు ఈ దాడి నిర్వహించినట్టు ఆయన వెల్లడించారు. అఫ్గాన్ లోని నంగర్ హర్ జిల్లాలో ఐసిస్ ఉగ్రవాదుల భూగర్భ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడిని నిర్వహించినట్టు ఆయన తెలిపారు.