: బీర్ బాటిల్ లో దర్శనమిచ్చిన చచ్చిన బల్లి!
చిల్డ్ బీర్ బాటిల్ లో చచ్చిన బల్లి దర్శనమివ్వడంతో కస్టమర్లు కంగుతిన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీహర్ష వైన్ షాపులో నిన్న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇద్దరు కస్టమర్లు ఒక బీర్ ను కొనుగోలు చేశారు. ఈ క్రమంలో బీరు బాటిల్ లో ఏదో ప్రాణి ఉన్నట్టు వారు గుర్తించారు. బాటిల్ ను పరిశీలించి చూడగా, చనిపోయిన బల్లి ముక్కలు కన్పించాయి. దీంతో, ఈ విషయమై సదరు వైన్ షాపు యజమానికి వారు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదు. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల దృష్టికి ఆ కస్టమర్లు తీసుకువెళ్లారు. ఎక్సైజ్ శాఖ అధికారులు ఆ బీరు బాటిల్ ను సీజ్ చేసి, పరీక్షల నిమిత్తం ల్యాబ్ కు పంపారు.